కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో వ్యక్తి సూసైడ్​

  • మెదక్​​ జిల్లా అల్లాదుర్గంలో ఘటన
  • పోలీస్ ​స్టేషన్​ ముందు బాధిత కుటుంబసభ్యుల ఆందోళన


అల్లాదుర్గం, వెలుగు: కానిస్టేబుల్​ కొట్టాడని మనస్తాపం చెందిన  ఓ వ్యక్తి  సూసైడ్​ చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్  గ్రామానికి చెందిన తలారి కిషన్(32) తన సెల్ ఫోన్  పోయిందని బుధవారం రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో సాయిలు అనే కానిస్టేబుల్  కొట్టడంతో, పోలీస్​స్టేషన్​కు వెళితే న్యాయం జరగకపోగా.. బాధితుడినైన తననే కొట్టడంతో తాను మనస్తాపానికి గురయ్యానని కిషన్  సూసైడ్  నోట్  రాసి గ్రామంలోని కమ్యూనిటీ హాల్​లో ఒంటిపై పెట్రోల్  పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్​ చేసుకున్నాడు.

కమ్యూనిటీ హాలులో నుంచి పొగలు రావడంతో గమనించిన గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా, కిషన్​ కాలిన గాయాలతో ఉండడాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు తీవ్రంగా గాయపడిన కిషన్​ ను చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్​ పరిశీలిస్తుండగానే చనిపోయాడు. ఇదిలాఉంటే కిషన్​ సూసైడ్​ చేసుకున్న కమ్యూనిటీ హాల్​ సమీపంలో అతని బైక్​ నిలిపి ఉండగా, బుధవారం కుటుంబసభ్యులు పరిశీలించగా.. అందులో రూ.10 వేలు, ఒక లెటర్​ దొరికింది. అందులో ‘రాత్రి పోలీస్​ స్టేషన్​కు వెళితే కానిస్టేబుల్​ సాయిలు కొట్టాడు. నన్ను చంపేసింది నా చుట్టూ ఉన్న ప్రకృతి, పీఎస్ కు పోతే న్యాయం జరగలేదు. సత్యం చచ్చిపోయింది, ఎస్ఐ ప్రవీణ్​రెడ్డి సార్​ సెల్యూట్’ అని రాసి కింద కిషన్​ అని సంతకం ఉంది.

కానిస్టేబుల్​ కొట్టడంతోనే కిషన్​ సూసైడ్​ చేసుకున్నాడని తెలుసుకున్న బంధువులు కానిస్టేబుల్  సాయిలును కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్  ముందు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి విచారణ జరిపి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.